జగదేవపూర్, వెలుగు:సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ లోని కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. సోమవారం అమ్మవారి ఆలయ ఆవరణలో సదరుపటం కార్యక్రమం నిర్వహించారు. జాతర ప్రారంభానికి ముందు భోగి పండుగ రోజున సదరుపటం వేయడం ఆనవాయితీగా వస్తోంది. సదరుపటాన్ని వంశపారపర్యంగా బైండ్ల కులస్తులు వేసి ఆలయ అర్చకులచే పట్నాలు ఎక్కించారు.
అనంతరం అమ్మవారికి ఆలయ నిర్వహకులు ఘటం, బోనం తీశారు. సదరుపటం వేసిన తర్వాత భక్తులు ఎవరైనా పటాలు వేసుకోవచ్చు. జాతర జనవరి 20 నుంచి ప్రారంభమై ఉగాదితో ముగియనుంది. కొండపోచమ్మ ఆలయ మాజీ చైర్మన్ హన్మంతరెడ్డి, మాజీ సర్పంచ్ భాను ప్రకాశ్ రావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, సర్పంచ్ రజిత, ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, హరిబాబు, పూజారులు కృష్ణమూర్తి, లక్ష్మణ్ పాల్గొన్నారు.